డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు
- శివధర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- పోలీసు శాఖ అత్యుత్తమ సంప్రదాయాలను కొనసాగిస్తానని వ్యాఖ్య
- శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమన్న నూతన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్న అనంతరం, ఆయన తన ప్రాధాన్యతలను స్పష్టంగా వివరించారు. తనపై నమ్మకం ఉంచి అత్యున్నత బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, తెలంగాణ పోలీసులు దశాబ్దాలుగా పాటిస్తున్న అత్యుత్తమ సంప్రదాయాలను కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ యంత్రాంగాన్ని మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేశంలో నక్సలిజం సమస్య అంతిమ దశకు చేరుకున్న తరుణంలో, పోలీసుల కార్యాచరణలో కూడా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు నక్సలిజాన్ని కట్టడి చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. కేవలం అణచివేత ధోరణి కాకుండా, లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన పునరావాసం కల్పించడం, వారికి ఉపాధి మార్గాలు చూపడం వంటి సామాజిక కోణంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన విశ్లేషించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా, ప్రజల భద్రతే పరమావధిగా పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖ ఖ్యాతిని మరింత పెంచుతానని ఆయన స్పష్టం చేశారు.